Movies

తెలుగు


ఇది చాలా హాట్ గురూTelugu State, Nation and Inter Nation News UP Date: 19/08/2011


ప్రతిష్టంభన తొలిగింది

పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వైఖరి అవలంబించడంతో గురువారం గాంధేయవాది అన్నాహజారేకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన తొలగి, నిరాహార దీక్ష విషయంలో ఒక ఒప్పందానికి వచ్చారు. ఢిల్లీ పోలీసులతో హజారే బృందానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, అన్నాహజారే శుక్రవారం నుంచి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. కొన్ని షరతులకు లోబడి ఈ దీక్ష 15 రోజులపాటు సాగుతుంది. సెప్టెంబర్‌ 2 వరకు మాత్రమే అనుమతి ఉంది.

ఇది నిరవధిక దీక్షే కానీ, ఆమరణ దీక్ష కాదు. ఆరోగ్యం సహకరించినంతవరకే హజారే నిరాహారదీక్ష చేస్తారు. హజారే నిరాహార దీక్షపై అంతకు ముందు విధించిన షరతులవల్ల ఇరు వర్గాలు పట్టుదలలకు పోయాయి. పర్యవసానంగా ప్రతిష్టంభన ఏర్పడింది. రెండు రోజులు రాత్రింబవళ్లు హోరాహోరీ చర్చల అనంతరం గురువారం ప్రభాతవేళ ప్రభుత్వానికి, అన్నా హజారేకి మధ్య ఒప్పందం కుదరడంతో క్లిష్టపరిస్థితి తొలగింది. అయితే, దీక్షకు వేదిక సిద్ధం కాకపోవడంతో అన్నా మరో రాత్రి కూడా తీహార్‌ జైలులో గడుపుతారు. స్థలం తక్కువగా ఉన్న జయప్రకాష్‌ నారాయణ్‌ పార్క్‌ను ఢిల్లీ పోలీసులు కేటాయించారు. ఆ తర్వాత అంత కన్నా విశాలంగా ఉండే రామ్‌లీలా మైదానాన్ని హజారే నిరాహార దీక్షకు కేటాయించారు. జెపి పార్క్‌లో దీక్ష చేస్తే అయిదువేల మంది కంటే ఎక్కువ మంది రాకూడదని అంతకు ముం దు పోలీసులు షరతు విధించిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్ష కాదు.

ఈ సందర్భంగా మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. గాంధేయవాది నిరాహార దీక్ష ఆమరణ దీక్ష కాదని, ఆయన ఆరోగ్యం అనుమతించేవరకు మాత్రమే దీక్ష చేస్తారని హజారే బృందం గురువారం స్పష్టం చేసింది. ఆయన దీక్ష చేసేటప్పుడు వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్‌ నరేష్‌ బృందం భావిస్తోందని, అన్నాకు అవసరమైన వైద్యసహాయం అందుతుందని హజారే సన్నిహిత అనుచరుల్లో ఒకరైన కిరణ్‌బేడీ తెలిపారు.ఒప్పందం నేపథ్యంలో హజారే బృందం వైఖరిలో కూడా మార్పు కనిపించింది.న్యాయవ్యవస్థ జవాబుదారీతనంపై ప్రభుత్వం ఒక మంచి చట్టం తెస్తే, జన్‌లోక్‌పాల్‌ చట్టం పరిధిలోకి ఉన్నత న్యాయవ్యవస్థను చేర్చాలని తాము పట్టుబట్టబోమని హజారే బృందం తెలిపింది.

తాము రూపొందించిన జన్‌లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లును కనీసం పార్లమెంటు పరిశీలనకు పంపాలని ఆ బృందం కోరింది. అంతకుముందు హజారే సన్నిహితులు కిరణ్‌బేడీ, ప్రశాంత్‌భూషణ్‌కు, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బికె గుప్తాకు మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జరిగిన చర్చలు ఫలించడంతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. హజారే బృందం తన డిమాండ్లను చాలావరకు నెగ్గించుకుంది. అయితే, దీక్ష కాలపరిమితిపై వెనక్కు తగ్గింది. హజారే నిరాహారదీక్షను 15 రోజులకే పరిమితం చేసుకోవాలన్న పోలీసుల సూచనను బృందం అంగీకరించింది. కనీసం నెలరోజులు దీక్ష చేసేందుకు హజారేకు అనుమతివ్వాలని బుధవారం వరకు అన్నా బృందం పట్టుబట్టింది.

షరతుపైనే దీక్షకు అనుమతి ః హోంశాఖ కార్యదర్శి
అన్నాహజారేకు షరతుపైనే నిరాహార దీక్షకు అనుమతించామని, సెప్టెంబర్‌ 2 వరకే గడువిచ్చామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి ఆర్‌కె సింగ్‌ అన్నారు. ‘ఢిల్లీ పోలీసులు అన్నా బృందంతో చర్చలు జరిపారు. అనంతరం వారొక నిర్ణయానికి వచ్చారు. హజారే నిరాహారదీక్షకు కొన్ని షరతులతో సెప్టెంబర్‌ 2 వరకు మాత్రమే అనుమతిచ్చామని ఢిల్లీ పోలీసులు హోంమంత్రిత్వశాఖకు తెలిపారు’ అని సింగ్‌ విలేకరులతో అన్నారు.

ఈ ఒప్పందం ఒక వర్గం విజయమనో, మరో వర్గం అపజయమనో చెప్పడం సరికాదని చెబుతూ హోంశాఖ కార్యదర్శి ‘ఫలానా చోట, పరిమిత వ్యవధి విధిస్తూ షరతులతో అనుమతిచ్చామన్నది ఇక్కడ ముఖ్యంగా గమనించాలి’ అని స్పష్టం చేశారు.ఇంతకు ముందు ప్రతిపాదించిన జెపి పార్కులో దీక్ష చేపట్టేందుకు షరతులు విధించడానికి కారణాల్ని కూడా ఆయన వివరించారు. ‘అక్కడి స్థలం పరిమితమైన సంఖ్యలో జనం వస్తే సరిపోతుంది తప్ప అంతకు మించితే కష్టమవుతుంది. అలాగే వాహనాల పార్కింగ కూడా సమస్య అవుతుంది. అందుకే షరతు విధించడం జరిగింది’ అని ఆర్‌కె సింగ్‌ చెప్పారు.

షరతుల్ని ఒప్పుకొన్న అన్నా బృందం
ఒప్పందానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపే రెండు పేజీల అంగీకార పత్రాన్ని అన్నా బృందం పోలీసులకు ఇచ్చింది. ప్రస్తుత నియమనిబంధలను పాటిస్తామని, మైదానం సామర్థ్యాన్ని మించి జనసాంద్రత ఉండబోదని వారా పత్రంలో హామీ ఇచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో 25 వేల మంది వరకు సమావేశం కావచ్చు. ఈ పత్రంపై హజారే తనకు తానుగా సంతకం చేయడమే కాకుండా, అర్వింద్‌ కేజ్రీవాల్‌, ప్రశాంత్‌భూషణ్‌, కిరణ్‌బేడీ, శాంతిభూషణ్‌ కూడా సంతకాలు చేశారు. ఒప్పందపత్రంలోని ఏ అంశాన్ని ఉల్లంఘించినా చట్టప్రకారం తమను ప్రాసిక్యూట్‌ చేయవచ్చని కూడా వారు చెప్పారు.


జగన్‌ ఆస్తుల జల్లెడ: 6 గంటల నుంచే సిబిఐ ముప్పేట దాడులు

ఎంపీ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తులు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ గోల్‌మాల్‌ వ్యవహారాలపై సిబిఐ జల్లెడ పడుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తిస్థాయి దర్యాప్తునకు రంగంలో దిగిన సిబిఐ అధికారులు గురువారం హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలలో 92 చోట్ల మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ముందస్తు వ్యూహం ప్రకారం అటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అవకతవకలు ఇటు జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, ప్రముఖుల ఇళ్లపై సిబిఐ నిర్వహించిన దాడులు పలు వర్గాలను హడలెత్తించింది. సోదాలను వీడియో ద్వారా చిత్రీకరించారు. కాగా దాడుల సమయంలో సిబిఐ అధికారులు ఎపిఐఐసి మాజీ ఎం.డి బిపి ఆచార్య సహా పలువురిని విచారించడంతోపాటు వారి వాంగ్మూలం తీసుకుంది. రాష్ట్రంలో భారీ కుంభకోణాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ అవకతవకలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తులపై సిబిఐ పూర్తి స్థాయి దర్యాప్తు ఊపందుకుంది. రాష్ట్ర మంత్రులు శంకర్రావు, రవీంద్రారెడ్డిలతో పాటు టిడిపి నేతలు ఎర్రన్నాయుడు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై నెల రోజుల క్రితం మొదలైన సిబిఐ విచారణ హైకోర్టు తాజా ఆదేశాలతో మరింత వేగం పుంజుకుంది. రెండు కేసుల్లో అక్రమాలను వెలికి తీసేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తునకు రంగంలో దిగిన సిబిఐ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం దేశ వ్యాప్తంగా ఐదు నగరాలలో 32 కంపెనీలకు సంబంధించిన 92 చోట్ల దాడులు నిర్వహించారు. సిబిఐ ప్రాథమిక విచారణలో 25 కంపెనీల నుంచి సేకరించిన ఆధారాలను క్రోడీకరించిన అధికారులు 32 కంపెనీలతో పాటు మరి కొందరు ప్రముఖుల ఇళ్లపై దాడులు చేశారు. ఇందులో హైదరాబాద్‌, బెంగళూరులలోని వై.ఎస్‌ జగన్‌ సహా ఆయన సోదరి షర్మిలా, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌తో పాటు నగరంలోని జగన్‌ సన్నిహిితులు నిమ్మగడ్డ ప్రసాద్‌ అలియాస్‌ మ్యాట్రిక్‌ ప్రసాద్‌, ఎం.శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాసరాజు, మాధవ రామచంద్రం, అజయ్‌ గారపాటి, అనంత సేనారెడ్డి, ప్రసాదరెడ్డి, శ్రీనివాసనాయుడు, లగడపాటి శ్రీధర్‌, ఎ.కె దండమూడిలు ప్రముఖంగా వున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలలోని లాస్కో గ్రూప్‌, లాస్కో సంస్థలతో పాటు జూబ్లిస మీడియా, మ్యాట్రిక్‌ ్స, యునిటెక్‌, పివిపి వెంచర్స్‌, మోడి ఫోర్డ్‌ , పెన్నా సిమెంట్‌, వ్యాంపిక్‌, హెటీరో డ్రగ్స్‌ ఆ కంపెనీకి అనుబంధంగా వున్న ల్యాబ్స్‌, హెల్త్‌ కేర్‌లు, నవ భారత్‌ కన్‌స్ట్రక్షన్స్‌, పివిపి వెంచర్స్‌, కార్నా కర్మాల్‌, యాక్సిస్‌ క్లినికల్‌ ల్యాబ్‌, అల్ఫా ఎవెన్యూ, అల్ఫా విల్లాస్‌, పయనీర్‌ ఇన్ఫా కంపెనీ, మంత్రి డెవలపర్స్‌, క్లాసిక్‌ రియాల్టిస, జి2, అరవిందో ఫార్మా, సందేశ్‌ ల్యాబ్‌, గిల్‌క్రిస్ట్‌ ఇండియా, భారతి సిమెంట్స్‌, సాక్షి దినపత్రిక, హెట్రా హెల్త్‌ కేర్‌, పులివెందుల పాలిమర్స్‌తో పాటు నగరంలోని ప్రభుత్వ విభాగాలు ఎపిఐఐసి, గనుల శాఖల్లోనూ సిబిఐ సోదాలు నిర్వహించింది.

ఇందులో హైదరాబాద్‌లో దాడుల కోసం 15 ప్రత్యేక బృందాలను నియమించారు. వీరంతా బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైల నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. ప్రతి బృందంలో ఏడు నుంచి పది మంది వరకు అధికారులున్నారు. మిగతా చోట్ల దాడులకు మరో 15 బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం అర్ధరాత్రి కొన్ని చోట్ల సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి వీటిని ముమ్మరం చేశారు. బేగంపేట్‌లోని దిల్‌కుష్‌ గెస్ట్‌హౌస్‌ కేంద్రంగా కొనసాగిన ఈ దాడులను సిబిఐ జెడి లక్ష్మీనారాయణ స్వయంగా పర్యవేక్షించారు. వై.ఎస్‌ జగన్‌ ఇంట్లో జరిగిన సోదాలు, భారతి సిమెంట్స్‌ కార్యాలయంలో జరిగిన సోదాలలో ఆయన పాల్గొన్నారు. దాడుల సందర్భంగా అన్ని చోట్ల సిబిఐ అధికారులు పెద్ద సంఖ్యలో రికార్డులను, కీలక పత్రాలను, హార్డ్‌ డిస్క్‌ లను స్వాధీనం చేసుకున్నారు. సిబిఐ అధికారుల వెంట న్యాయ నిపుణులు, బ్యాంకింగ్‌ రంగ నిపుణులు వుండడం విశేషం. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబయి నగరాలలో జరిగిన సోదాలను కూడా జెడి లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. దాడులను సిబిఐ అధికారులు వీడియో ద్వారా చిత్రీకరించారు. కాగా ఈ దాడులు శుక్రవారం కూడా కొనసాగే వీలుంది.

ఆచార్య సహా పలువురి వాంగ్మూలం నమోదు

ఇదిలావుండగా ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ గోల్‌మాల్‌ వ్యవహారాలు, జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తులపై సిబిఐ నిర్వహించిన దాడుల్లో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహేంద్రహిల్స్‌లోని ఎపిఐఐసి మాజీ ఎండి బిపి ఆచార్య ఇంట్లో సిబిఐ అధికారులు ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో లోటస్‌ఫాండ్‌లో గల వై.ఎస్‌ జగన్‌ ఇంట్లోనూ ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించారు. జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌, సాక్షి దినపత్రిక కార్యాలయాల్లో ఎనిమిది గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి మొదలైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. కాగా ఆచార్య ఇంట్లో సోదాల సమయంలో ఆయన అక్కడే వున్నారు. సిబిఐ అధికారులు అడిగిన అన్ని వివరాలను ఆయన అందించారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు సంబంధించి తెలుగు దేశం పార్టీ హయాంలో జరిగిన ఒప్పందాలు, అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒప్పంద మార్పులు, దానిద్వారా ప్రభుత్వానికి జరిగిన లాభనష్టాల వివరాలను ఆయన సిబిఐ అధికారులకు వెల్లడించారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు సంబంధించి జరిగిన లావాదేవీలపై ఆయన వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసింది. ఆయన ఇంట్లోని పత్రాలను, హార్డ్‌ డిస్క్‌ల ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు హెటిరో డ్రగ్స్‌ అధినేత శ్రీనివాసనాయుడును కూడా సిబిఐ విచారించింది. ఆయన వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. వీరితో పాటు జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కొన్ని కంపెనీల అధినేతలను కూడా సిబిఐ విచారించి వారి వాంగ్మూలన్ని రికార్డు చేసింది.

దాడులు పూర్తి కాగానే వివరాలు వెల్లడిస్తాం.

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

కాగా ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ గోల్‌మాల్‌ వ్యవహారాలు, జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తులపై సిబిఐ కొనసాగిస్తున్న దాడులపై ఇప్పటికిప్నడు వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ మీడియాకు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐదు నగరాలలో దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. జగన్‌ను విచారించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. సోదాల సందర్భంగా లభించిన ఆధారాలను బట్టి తదుపరి దాడులు ఎన్ని రోజులు కొనసాగించాలో నిర్ణయిస్తామని ఆయన వివరించారు. మాకు అందిన సమాచారం మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో న్యాయ, ఆర్థిక రంగ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.


అంతా దేవుడు చూస్తున్నాడు:ఓదార్పులో వైఎస్ జగన్

"అంతా దేవుడు చూస్తున్నాడు... ఆయన మనవైపే వున్నాడు... మనకేమీ కాదు... వైఎస్ కుటుంబాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ నైతిక విలువలు మరిచి టీడీపీతో చేతులు కలిపింది. 2004, 2009లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కారణమైన వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆ పార్టీ నైతిక విలువలు మరిచిపోయింది'' అంటూ వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో తాత్విక ధోరణిలో ప్రసంగించారు. గురువారం ఆయన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు, చందర్లపాడు, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు.

ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి పట్టించుకోని చంద్రబాబునాయుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబుపై సీబీఐ విచారణ వేస్తే దానిని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్టిగేషన్ అంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న సంగతిని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పెద్దలతో లాలూచీ పడి వైఎస్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు సీబీఐ విచారణ కోరుతూ కోర్టుకు వెళ్లారని అన్నారు. దేవుడన్నీ చూస్తున్నాడని, ఎన్నికలు ఎప్పుడు జరిపినా ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. త్వరలో స్వర్ణయుగం వస్తుందని, అందరి బాధలు తీరతాయన్నారు.


సౌమిత్రకు అభిశంసన: రాజ్యసభ చారిత్రక తీర్మానం

ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబంగా నిలుస్తున్న భారత పార్లమెంట్ గురువారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని తన స్వయంప్రతిపత్తిని, సత్తాను నిరూపించుకుంది. పార్లమెంట్ సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఒక హైకోర్టు న్యాయమూర్తి పాల్పడిన అవినీతి, అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా అభిశంసించి ఆయనను పదవినుంచి తప్పించవలసిందిగా రాష్టప్రతికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. పెద్దల సభగా గుర్తింపు పొందిన రాజ్యసభకు ఈ గౌరవం దక్కింది. 65 సంవత్సరాల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్టప్రతి నుంచి నియామకం పొందిన ఒక న్యాయమూర్తిని ఆ మాటకు వస్తే అత్యున్నతమైన పదవిలో ఉన్న వారిని అవినీతి ఆరోపణలపై అభిశంసించి పదవినుంచి తప్పించవలసిందిగా కోరటం ఇదే మొదటిసారి. 1991లో జస్టిస్ రామస్వామిని పదవి నుంచి తప్పించటానికి ప్రతిపాదించిన అభిశంసన తీర్మానం లోక్‌సభలో కోరం లేకపోవటంతో వీగిపోయింది. అయితే గతానికి పూర్తిగా విరుద్ధమైన తీరులో గత రెండు రోజులుగా కోల్‌కతా హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ సౌమిత్రసేన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత ఆయనను పదవి నుంచి తప్పించవలసిందిగా కోరుతూ రాష్టప్రతికి ప్రతిపాదించాలని రాజ్యసభ తీర్మానించింది. గత రెండు రోజులుగా నాలుగు గంటలకుపైగా జరిగిన చర్చ ముగిసిన తరువాత చైర్మన్ హమీద్ అన్సారీ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టారు. జస్టిస్ సేన్‌ను పదవి నుంచి తప్పించవలసిందిగా కోరుతూ 189మంది ఓటు వేయగా అభిశంసనకు వ్యతిరేకంగా 17ఓట్లు పడ్డాయి. సభానాయకుడైన ప్రధాని మన్‌మోహన్ సింగ్ చర్చ మొదలైనప్పటి నుంచి ఓటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు సభలోనే ఉన్నారు. సిపిఎం పక్షం నాయకుడు సీతారాం ఏచూరి ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ బుధవారం ప్రారంభించిన చర్చ గురువారం ముగిసింది. న్యాయశాస్త్రంలో ఆరితేరిన రాంజెఠ్మలానీ, నాచియప్పన్, రవిశంకర్ ప్రసాద్ వంటి ఉద్ధండులు న్యాయమూర్తి పదవి నుంచి సేన్‌ను తొలగించని పక్షంలో ఇటు న్యాయవ్యవస్థకే కాక సభాగౌరవానికి కూడా భంగం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. రాజ్యసభ ఆమోదించిన అభిశంసన తీర్మానం ఇప్పుడు లోక్‌సభకు చేరుకుంటుంది. ఈనెల 26,27 తేదీలలో ఈ తీర్మానంపై చర్చ జరుగుతుంది. చర్చ ముగిసిన తరువాత రాజ్యసభలో మాదిరి ఓటింగ్‌కు పెడ్తారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం గెలవాల్సి ఉంటుంది. లోక్‌సభలో కూడా తీర్మానం నెగ్గితే రాష్టప్రతి ఆమోదానికి పంపుతారు. రాష్టప్రతి ఆమోదముద్ర లభించిన మరుక్షణం పార్లమెంట్ అభిశంసనకు గురైన మొదటి న్యాయమూర్తిగా జస్టిస్ సౌమిత్ర సేన్ పేరు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
అసోంకు చెందిన సేన్ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కాకముందు అడ్వకేట్ హోదాలో స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా చేసిన కొనుగోళ్లపై తలెత్తిన వివాదంలో రిసీవర్‌గా ఉన్నారు. వచ్చిన సొమ్మును దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివిధ స్థాయిల్లో విచారణలు జరిగాయి. నిధులు దుర్వినియోగమైనట్లు రుజువైంది. ఆయన ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాకుండా తన తరపున న్యాయవాదులను పంపి వాదనలు వినిపించారు.
సేన్‌పై వచ్చిన ఆరోపణలపై విచారించటానికి రాజ్యసభ చైర్మన్ అన్సారీ 57మంది సభ్యులు చేసిన డిమాండ్‌ను పురస్కరించుకుని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ ముక్కుల్ ముదుగుల్‌తో పాటు ప్రముఖ న్యాయవాది నారిమన్‌తో ఒక విచారణ సంఘాన్ని నియమించారు. ఈ కమిటీ సేన్ నిధులను దుర్వినియోగం చేయటంతో పాటు ఈ అంశానికి సంబంధించిన నిజాలను దాచి పెట్టారని సాక్ష్యాధారాలతో నిరూపించింది. తానెట్టి అవకతవకలకు పాల్పడలేదని సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్‌తో పాటు కొంతమంది న్యాయమూర్తులు తనను బలి పశువును చేశారని జస్టిస్ సేన్ రాజ్యసభను నమ్మించటానికి విఫలయత్నం చేశారు.


సానుభూతి వ్యూహం బెడిసికొడుతుందా? భవిష్యత్తుపై గుబులు

రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గుండెలో దడ మొదలైంది. హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి జగన్ సంస్థలు సహా ఆయనతో లావాదేవీలు జరిపిన వ్యాపార సంస్థలపై సీబీఐ సోదాలు చేపట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అవినీతి ఆరోపణలపై జగన్‌ను అరెస్టు చేస్తే సానుభూతి పవనాలు ఉధృతంగా వీస్తాయని... ఆ ప్రభావం ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని ఇన్నాళ్లూ వారు ఆశిస్తూ వచ్చారు.

కానీ.. అన్నా హజారే నేతృత్వంలో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న తరుణంలో అవినీతి కేసుల్లో జైలుపాలైతే సానుభూతి తగ్గిపోతుందని కలవరపడుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని భయపడుతున్నారు. అవినీతిపై న్యాయస్థానాల కఠిన వైఖరికి బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్ అభిశంసన అంశమే ఉదాహరణగా జగన్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో సుప్రీం కోర్టులో జగన్‌కు స్టే రావడంకూడా సందేహమేనని అభిప్రాయపడుతున్నారు. సీబీఐ లోతైన దర్యాప్తును చేయడం కూడా ఈ వర్గంలో గుబులు రేపుతోంది.

జగన్‌పై సీబీఐ నమోదు చేసిన కేసుల సెక్షన్లను పరిశీలిస్తే ఆయన జైలుకు వెళ్లడం తప్పదనే అభిప్రాయం జగన్ పార్టీ నేతల్లో ఉంది. ఆయన జైలుకు వెళ్తే పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పగ్గాలను చేపట్టి జగన్ స్థానంలో ఓదార్పు యాత్రను చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అయితే.. అవినీతిపై ఉధృతంగా పోరాటం జరుగుతున్న సమయంలో ఈ వ్యూహం ఫలిస్తుందా? సానుభూతి పవనాలు వీస్తాయా అనే సందేహాలతో సతమతమవుతున్నారు. సీబీఐ సోదాలపైనా భారీ స్థాయిలో నిరసన వ్యక్తమవుతుందని ఆశించినప్పటికీ.. జగన్‌తో బంధుత్వం కలిగిన ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు, కొండా మురళీ మోహన్, మాజీ మంత్రి కొండా సురేఖ వంటి నేతలు మినహా.. మిగిలిన శానససభ్యుల నుంచి ఎలాంటి స్పందనా లేదు.

జగన్‌వర్గ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా జగన్‌ను ఇబ్బందికి గురిచేసేవిగానే ఉన్నాయని ఆపార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో నిజాయితీ కలిగిన నాయకుడిని చూపిస్తే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తానంటూ రాజమోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు... జగన్ అవినీతికి పాల్పడినట్లు పరోక్షంగా అంగీకరించడమే కదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద ప్రస్తుత రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.


ముందుకా ... వెనక్కా...? తెలంగాణ ఉద్యమ ఉద్ధృతిపై మీమాంస

సకల జన సమ్మెతో తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస భావిస్తుండగా, ఇందులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టిఆర్‌ఎస్ మాత్రం అందుకు సుముఖంగా లేనట్టు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అందుకు అనుకులంగా లేవని టిఆర్‌ఎస్ గట్టిగా విశ్వసిస్తోందని తెలుస్తోంది. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే.. ‘గుడ్డిగా వెళ్లి గోడకు బాదుకుంటే తల పగలడం తప్ప ఫలితం ఉండదు. ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి. రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ఎత్తుకు పైఎత్తులతో కీలు ఎరిగి వాత పెట్టాలి. అలా కాకుండా గత్తర పడితే ఆగం కావడమే తప్ప ఫలితం ఉండదు.’ ఇటీవల ప్రత్యేకంగా కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేయకపోయినా సకల జన సమ్మె పట్ల ఆయన వ్యూహాత్మక వౌనం పాటిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి పరిస్థితులు సానుకూలంగా లేవని భావించడం వల్లనే కెసిఆర్ వౌనంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ కారణంగానే సకల జన సమ్మెకు సన్నాహకంగా టిజెఎసి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన మహాధర్నాకు గానీ, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరానికి గానీ ఆయన హాజరుకాలేదని ఆ పార్టీ వర్గాల సమాచారం. టిజెఎసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పై రెండు కార్యక్రమాలకు కెసిఆర్ దూరంగా ఉండటానికి కారణం కూడా అదేనని ఈ వర్గాల కథనం. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి అనుకూలంగా లేకపోవడం వల్లనే ముందుగా ప్రకటించిన మేరకు ఈ నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఉద్యోగుల సమ్మెను కెసిఆరే వాయిదా వేయించారని తెలిసింది. ఉద్యోగుల సమ్మె ఈ నెల 17 నుంచి కాకుండా వచ్చే నెల 6కు వాయిదా పడడానికి కూడా టిఆర్‌ఎస్ పార్టీయే కారణమని టిజెఎసి నేతలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగుల సమ్మె వాయిదా వేయడానికి ముందు జరిగిన టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఉద్యోగుల సమ్మె ఇప్పుడే వద్దని టిఆర్‌ఎస్ పార్టీ గట్టిగా పట్టుబట్టడంతోనే వాయిదా పడిందని ఆ సమావేశానికి హాజరైన బిజెపి నేతలు వ్యక్తిగత సంభాషణల్లో బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని వాదిస్తున్న టిఆర్‌ఎస్ చూపుతున్న కారణాలతో టిజెఎసి నేతలు కూడా కొందరు ఏకీభవిస్తున్నారు. అయితే టిజెఎసిలోని మెజార్టీ నేతలు, సంఘాలు మాత్రం టిఆర్‌ఎస్ వాదనతో ఏకీభవించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఎంత ఉద్ధృతం చేసినా ఫలితం ఉండబోదని టిఆర్‌ఎస్ చూపుతున్న కారణాల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం అన్నా హజారే ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నది ప్రధానమైంది. దీనికితోడు సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా అమెరికాలో ఉన్నారు. ఆమె తిరిగి వచ్చేదాకా తెలంగాణ రాష్ట్రం వంటి కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకునే పరిస్థితి లేదని టిఆర్‌ఎస్ వాదిస్తోందని తెలిసింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలంటే కేవలం ఉద్యోగుల సమ్మె వల్ల సాధ్యం కాదని, దీనికి రాజకీయ సంక్షోభం అవసరమని టిఆర్‌ఎస్ భావిస్తోంది. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామా చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి చర్చల ప్రక్రియను చేపట్టింది. ఆ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు వేచి చూసే ధోరణితో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆగుదామంటున్నారు. పాలక పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేలేమని టిఆర్‌ఎస్ వాదిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరితో టిడిపి తెలంగాణ ఫోరం కూడా మళ్లీ రాజీనామాలు చేసే విషయంలో వెనక్కి తగ్గడం వల్ల టిఆర్‌ఎస్ ఒక్కటే ఏమీ చేయలేదన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలంటే ఏదో ఒకటి సెగ రగిల్చే అంశం కావాలని టిఆర్‌ఎస్ వాదిస్తోంది. మొన్నటి వరకు ఎంచుకున్న 14ఎఫ్ రద్దు అంశం పరిష్కారం వల్ల ఉద్యమకారులు కొంతమేరకు చల్లబడ్డారనేది టిఆర్‌ఎస్ వాదన. దీనికి తోడు సమ్మెకు సిద్ధమైన ఉద్యోగులకు జీవో177 ప్రతికూలంగా మారడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. సమ్మెకు దిగితే జీవో 177 ప్రకారం ‘నో వర్క్ నో పే’ వల్ల ఉద్యోగ సంఘాలు కూడా కాస్త వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. పైగా తెలంగాణ ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేయకుండా ఉద్యోగులు మాత్రమే సమ్మె చేయడానికి సుముఖంగా లేకపోవడం వంటి తదితర కారణాలతో ఉద్యమాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్ధృతం చేయలేమన్నది టిఆర్‌ఎస్ వాదన.
అయితే ఉద్యమాన్ని కొంత కాలం పాటు వాయిదా వేయడం వల్ల వేడి తగ్గే ప్రమాదం ఉందని, కెసిఆర్ దీక్ష సమయంలో ఉద్ధృతంగా ఉన్న ఉద్యమం, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక కోసం ఆరు నెలలు వేచి చూడటం వల్ల తగ్గిందని టిజెఎసి వాదిస్తోంది. ఉద్యమాన్ని వాయిదా వేస్తే మళ్లీ వేడి పుంజుకోవడం కష్టమని పేర్కొంటోంది.


Quick Links

Gold Rate
Junior Colleges List
Schools List
PG Colleges List
Hyderabad Movies In Halls
Stock Market

More...