Telugu Stories    Contract All | Expand All

పశ్చాత్తాపం (06/06/2011)

ఒక అడవిలో కాకి, పిచ్చుక ఎంతో స్నేహంగా ఉంటుండేవి. అవి ఒకదానిని మరొకటి ఆపద సమయంలో ఆదుకోవడమే కాక ఒకదాని పిల్లల్ని మరొకటి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవి.

ఒకరోజు కాకి, పిచ్చుక పిచ్చా పాటిగా మాట్లాడుకొంటుండగా

‘‘రక్షించండి! రక్షించండి! నేస్తాల్లారా! ’’ అంటూ భయంతో వణికిపోతున్న నెమలి ఒకటి వాటి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది.

‘‘ఏమిటి నేస్తమా? ఎక్కడినుండి పరిగెత్తుకొస్తున్నావు? ఎందుకిలా కంగారుపడుతున్నావు? అని అడిగింది కాకి.

‘‘ మా కుటుంబంలోంచి పొరపాటున తప్పిపోయి వేటగాని కంటపడ్డాను. అతను నా వెంట పడుతుంటే తప్పించుకునే యత్నంలో పూర్తిగా దారితప్పి పరిగెత్తుకొస్తుంటే మీ ఇద్దరూ కనపడ్డారు. మీరే నన్ను ఆదరించి రక్షించాలి’’ అని వేడుకుంది నెమలి.

‘‘సరే! అలాగే నేస్తమా’’ అని ఆదరించాయి కాకి, పిచ్చుక.

తిరిగి వెళ్లడానికి దారి తెలియకపోవడంవల్ల కాకి, పిచ్చుకలతోపాటు అక్కడే వుండి వాటికి మంచి నేస్తమైంది నెమలి.

కొన్నాళ్లు బాగానే గడిచిపోయిది వాటి స్నేహం. కాకి, పిచ్చుకకు మధ్య ఉన్న అత్యంత స్నేహాన్ని జీర్ణించుకోలేకపోయిన నెమలికి క్రమంగా వాటిపై అసూయ మొదలైంది. ఎలాగైనా కాకి, పిచ్చుకను విడదీయాలనే దురాలోచన మొదలైంది నెమలికి.

ఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పిచ్చుకతో

‘‘మిత్రమా, నీవు కాకితో ఎందుకు అంత స్నేహాన్ని పెంచుకుని అత్యంత చనువుగా ఉంటున్నావు? ఎందుకలా దాన్ని గౌరవిస్తావు? అది ఎంత అందవిహీనమైందో ఒక్కసారైనా ఆలోచించావా? చనిపోయిన కుళ్లిపోయిన జంతు మాంసాన్ని తింటుంది. దాన్ని చూసి అందరూ చీదరించుకుంటారు. అది ఎవరి తలనైనా తాకితే అపశకునమని అంటారు. అంతేకాక చనిపోయిన వారికి పెట్టిన పిండాల్ని తెచ్చి మీ పిల్లలకు ఆహారంగా పెట్టడం నేను చాలాసార్లు చూసాను. నేను చెప్పవలసింది చెప్పాను. తరువాత నీ ఇష్టం’’ అంది నెమలి.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పిచ్చుక

‘‘నిజమే నేస్తమా! నేను ఇన్నాళ్లనుండి కాకి గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. దాని మొహం దాంతో స్నేహం చేయడమేంటి? నీలాంటి అందగత్తెతో స్నేహం చేస్తే నా విలువ, హోదా పెరుగుతుంది’’ అంది నెమలితో.

తన పథకం పారినందుకు ఎంతో సంబరపడిపోయింది నెమలి. నెమలి, పిచ్చుక ప్రవర్తనలలో తేడాను గమనించసాగింది కాకి. తనను వాటినుండి దూరం చేయాలనే దురాలోచనలో ఉన్నాయని గ్రహించింది కాకి.

ఒకరోజు

మిత్రులారా! నావల్ల, నా పిల్లల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోంది కాబోలు. అందువల్ల ఇక్కడకు సమీపంలో ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాను. నా పిల్లలతో సహా అక్కడికి వెళ్లిపోతాను. సెలవివ్వండి‘‘అని బాధతో అంది కాకి.

దానంతట అది వెళ్లిపోతున్నందుకు లోలోన ఎంతో సంతోషపడుతూ ‘‘సరే నీ ఇష్టం నేస్తమా!’’ అని అన్నాయి నెమలి, పిచ్చుకలు.

కాకిపీడ విరగడైనందుకు విందు చేసుకున్నారు పిచ్చుక, నెమలి.

ఇలా కొంతకాలం గడిచిపోయింది.

పాత మిత్రులను వదిలి వచ్చి చాలా రోజులైంది. ఒకసారి వాళ్లను చూడాలనే కోరిక కలిగింది కాకికి. నెమలి, పిచ్చుక నివశిస్తున్న వైపుకి వేగంగా వెడుతున్న కాకికి ఒక వేటగాడు పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిపై బాణాన్ని ఎక్కుపెట్టడం గమనించింది కాకి. కంగారు పడ్డ కాకి, నెమలిని రక్షించే ఉపాయం కోసం ఆలోచిస్తుండగా అక్కడ చనిపోయిన పాము ఒకటి కనపడింది కాకికి. దాన్నిచ టుక్కున నోట కరుచుకుని వేటగాడిమీద పడేట్టు జారవిడిచి

‘‘తప్పుకో నెమలి మిత్రమా! ఆపద ఆపద అని పెద్దగా అరిచింది కాకి.

నెమలి తలతిప్పి చూసేసరికి

‘‘అమ్మ బాబోయ్! పాము’’ అంటూ పెద్దగా అరుస్తూ భయంతో పరిగెడుతున్న వేటగాడు నెమలి కంటపడ్డాడు.

జరిగిన విషయాన్ని గమనించిన నెమలికి గుండె ఝల్లుమంది. పరిగెత్తుకుంటూ వచ్చి కాకి కాళ్లపై పడి.

‘‘క్షమించు మిత్రమా! అందగత్తెననే అహంకారంతో నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న నీకు మిత్రద్రోహం చేశాను. అన్యోన్య స్నేహితులైన మీ ఇద్దరినీ అసూయతో వేరు చేశాను. కానీ నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలనో’అంది నెమలి కన్నీరు కారుస్తూ.

‘‘పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి లేదు. నేను మనస్పూర్తిగా క్షమిస్తున్నాను‘‘అని నెమలిని కౌగిలించుకుంది కాకి. అపుడే వచ్చిన పిచుక విషయం తెలుసుకుని బాధపడడమే కాక, తాను చేసిన తప్పుకు సిగ్గుతో తలవంచుకుంది.

జరిగిన విషయాలన్నీ మరచిపోయి మనం మంచి నేస్తాలుగా ఉండిపోదాం అంటూ పిచ్చుక, నెమలిని దగ్గరకు తీసుకుని ప్రేమతో కౌగిలించుకుంది కాకి.


వింతగొర్రె (06/06/2011)

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను. అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది.

వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది. ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది. గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంటులు, నక్కలు భయంతో పరుగులు పెట్టాయి. చివరకు పులులు, సింహాలు కూడా గతుక్కుమన్నాయి. అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది. వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం, కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది. దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి. వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది. గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది.

ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది. అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది. ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది. ‘ఇదేమి విచిత్రం, సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా? సింహం ఆకలితో చస్తుంది. కానీ గడ్డి మాత్రం మేయదు. బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది.

ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది. తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది. ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది. ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది. గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది. ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి న ఊళ్లోకి వెళ్లిపోయింది. ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి. ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి.


నక్కమామ- కుందేలు (06/06/2011)

అనగనగా ఒక అరణ్యంలో ఒక కుందేలు ఉండేది. దానికి ఏ మాత్రం తెలివితేటలు లేవు. దానికి ఒక్కసారి కూడా ఎటువంటి ప్రవూదం ఎదురు కాలేదు. అందువల్ల దానికి భయువుంటే ఏమిటో కూడా తెలీదు. ఒకరోజు బాగా ఎండగా ఉంది. కుందేలుకు విపరీతమైన దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు బయులుదేరింది. దారిలో ఒక నక్క ఎదురరుుంది. కుందేలును చూడగానే నక్క నోట్లో నీళ్లూరారుు. అరుుతే అది కుంటినక్క. ఒక కాలు సరిగ్గా లేకపోవడంతో కుందేలును వేటాడడం దానికి సాధ్యం కాదు. అందుకని ఒక ఉపాయం పన్నింది.

కుందేలును చూస్తూ, ‘‘ఏంటి అల్లుడూ! ఇంత ఎండలో ఎక్కడికి వెళుతున్నావు? రా! ఇలా వచ్చి నీడలో కాసేపు విశ్రాంతి తీసుకో’’ అంటూ పిలిచింది నక్క.

‘‘నాకు దాహంగా ఉంది వూవూ! వుుందు నీళ్లు తాగి వస్తాను’’ అని ఎంతో వుర్యాదగా చెప్పి అక్కడి నుంచి కదిలింది కుందేలు.

కుందేలు నీటి కాలువ దగ్గరకు వెళ్లి చల్లటినీళ్లను కడుపునిండా తాగింది. దాహం తీరాక తిరిగి అది నక్క దగ్గరకు వచ్చింది.

కుందేలును చూసి నక్క ఆశ్చర్యపోరుుంది. ‘ఇది పిచ్చిదానిలా ఉంది. దీన్ని నమ్మించి మోసం చేయూలి?’ అనుకుంది.

‘‘నక్క వూవూ! నిన్ను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వంటే వూ వాళ్లకు చాలా భయుం తెలుసా? నిన్ను టక్కరినక్క అంటూ తిడుతుంటారు’’ అంది.

‘‘నిజమే అల్లుడూ! నేనెంతో వుంచిదాన్ని. కాని ఎవరూ నన్ను మెచ్చుకోరు’’ అంది ఎంతో దిగులు నటిస్తూ.

‘‘బాధపడకు. దీనికి పరిష్కారం కనుక్కుందాం. నువ్వు వుంచిదానివని అందరికి తెలిసేలా చేద్దాం?’’

‘‘అరుుతే ఈ రోజు రాత్రి నా ఇంటికి వస్తావా? భోజనం చేస్తూ వూట్లాడుకుందాం?’’ అంది నక్క.

‘‘తప్పకుండా వస్తాను!’’ అంది కుందేలు.

నక్క తనలో తాను క్రూరంగా నవ్వుకుంది. ‘‘అహ్హహ్హా... ఈ పిచ్చి కుందేలు నా వలలో చిక్కుకుంది. ఈ రాత్రికి కుందేలు ఇగురు వండుకుని తింటాను’’ అనుకుంది.

చీకటి పడగానే నక్క గుహకు బయులుదేరింది కుందేలు. నక్క ఎంతో ఆత్రంగా కుందేలు కోసం ఎదురుచూస్తూ ఉంది.

‘‘రా అల్లుడూ! నీ కోసమే చూస్తున్నాను’’ అంటూ ప్రేవుగా పిలిచింది నక్క.

అరుుతే అక్కడ తినడానికి ఆహారం ఏమీ కనిపించలేదు. ఆహారం కోసం కుందేలు వెతకసాగింది. నక్క తొందరపడి, భీకరంగా అరుస్తూ ఒక్కసారిగా కుందేలు పైకి దూకబోయింది. అదృష్టం.... కుందేలు ఇంకా పూర్తిగా లోపలికి రాలేదు. గుహ ద్వారానికి దగ్గరలోనే నిలబడి ఉంది. ప్రవూదం పసిగట్టిన కుందేలు నక్కకంటే వేగంగా వెనకకు దూకింది. కుందేలు మీద పడాల్సిన కుంటి నక్క దబ్బున నేలమీద పడింది.

‘బాబోయ్ నక్కలు నిజంగానే కుందేళ్లను తింటారుు’ అనుకుంటూ భయుంగా పారిపోరుుంది కుందేలు.

ఆరోజు నుంచి కుందేలు నక్కలకు, కుక్కలకు దొరక్కుండా దూరంగా మసలుతూ ఎంతో జాగ్రత్తగా ఉండసాగింది.


తిక్కకుదిరింది (02/06/2011)

అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. అది పరమ పిసినారి. ఒకసారి దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానిని ఏ వీధి అరుగుమీదో, ఏ చెత్తకుండీచాటునో కూర్చుని తినచ్చు కదా! ఊహూ... తోటి కుక్కలు చూస్తే తమకూ కాస్త పెట్టమంటాయని దాని భయం. ఎందుకంటే అది ఎప్పుడూ మిగతా కుక్కల దగ్గర ఆహారం అడిగి తినేది. అందుకే ఆ మాంసం ముక్కను తీసుకుని చాటుగా ఊరవతలికి బయలుదేరింది.

ఊరవతల ఒక చెట్టు మీద ఉన్న రెండు కాకులు కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్కను చూశాయి. దొరికిన ఆహారాన్ని కలిసి పంచుకుని తినే కాకులు కుక్క దగ్గర్నుంచి ఎలాగైనా సరే మాంసం ముక్కను కొట్టేయాలి అనుకున్నాయి. అందుకని అవి కుక్క ముందు వాలి స్నేహంగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టాయి.

‘‘కుక్క మామా! కుక్క మామా! బాగున్నావా? ఊరిలో నుంచి వస్తున్నావు, ఏమిటి సంగతులు?’’ అని ఒక కాకి అడిగింది. కుక్క ఏమీ లేవన్నట్టు తల అడ్డంగా ఊపింది.

‘‘నువ్వు మేలుజాతి కుక్కలా ఉన్నావు. నీలాంటి కుక్కను ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు. నీతో స్నేహం చేయాలని ఉంది. చేస్తావా?’’ అంటూ పొగిడాయి. కాకుల పొగడ్తలకు పొంగిపోయిన కుక్క ‘సరే’ అని తలూపింది.

వెంటనే రెండు కాకులూ సంతోషంగా అరుస్తూ కుక్క చుట్టూ తిరుగుతూ ఆడుకోసాగాయి. ఒక కాకి కుక్క వెనుకకు, మరొక కాకి కుక్క ముందుకు చేరాయి. వెనుకనున్న కాకి హఠాత్తుగా కుక్క తోక పట్టి లాగింది. ఉలిక్కిపడిన కుక్క మాంసపు ముక్కను నేల మీద పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఇంతలో ముందు వైపు ఉన్న కాకి ఆ మాంసపు ముక్కను నోటితో కరుచుకుని రివ్వున ఎగిరి వెళ్ళిపోయింది. పనైపోయిందిగా, ఇక రెండో కాకి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెండూ చెట్టు మీద కూర్చుని మాంసం ముక్కను పంచుకుని తిన్నాయి. పాపం ఆ కుక్క నోటమాటరాక అలా చూస్తూ ఉండిపోయింది.

నీతి: పొగడ్తలకు లొంగిపోయినవారు ఎప్పటికైనా ఇబ్బందులపాలు కాక తప్పద


తెలివైన నక్క (01/06/2011)

అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవంతా వెతకసాగింది. ఒకచోట దానికి చచ్చిపడున్న ఒక జింక కనిపించింది. ‘ఆహా! ఇవాళ నా అదృష్టం బావుంది. రెండు రోజులపాటు ఈ జింక మాంసం తిని కడుపు నింపుకోవచ్చు’ అనుకునేంతలో ఒక సింహం గట్టిగా గర్జించింది. ఆ శబ్దం వినపడగానే నక్క చెట్టు వెనుక నక్కింది.

‘అయ్యో! ఈ సింహం ఇప్పుడొచ్చిందేమిటి? అసలే దీని కడుపు పెద్దది. కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తుంది,’ అనుకుంది నక్క నిరాశగా.

సింహం జింక మాంసం తినబోయింది. ఇంతలో ఒక ఎలుగుబంటి అక్కడకు దూసుకు వచ్చింది. ‘‘ఏయ్! దాన్ని ముట్టుకోకు. అది నాది. నేనే ఆ జింకను వేటాడి చంపాను,’’ అంటూ గట్టిగా అరిచింది.

‘‘నువ్వు చంపడమేమిటి? అబద్ధాలు చెప్పకు. అయినా ఈ అడవికి నేను రాజును. కాబట్టి ఏ పదార్థాన్నైనా ముందుగా తీసుకునే అధికారం నాకే ఉంది. నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో,’’ అంటూ కోపంగా గర్జించింది సింహం.
ఎలుగుబంటి తక్కువేం తినలేదు. ‘‘నువ్వు రాజయితే నాకేంటి? కాకపోతే నాకేంటి? న్యాయం న్యాయమే! ఈ మాంసం నాది, అంతే’’ అంది కోపంగా.

ఇంకేం, నాదంటే నాదని రెండూ కాసేపు వాదించుకున్నాయి. తరువాత ముష్టియుద్ధానికి దిగాయి. సింహం తన పంజాతో ఎలుగుబంటి మూతి మీద కొడితే, ఎలుగుబంటి సింహాన్ని కిందపడేసి దాని నడుము మీద పిడికిలితో ఒక్కటిచ్చింది. చెట్టుచాటున దాగున్న నక్క ఇదంతా గమనిస్తోంది. సింహం ఎలుగుబంటి రెండూ భీకరంగా పోట్లాడుకోసాగాయి. అరగంట... గంట గడిచింది. చివరకు రెండూ కొట్టుకుని కొట్టుకుని సృ్పహ తప్పి పడిపోయాయి.

నక్క నెమ్మదిగా చెట్టుచాటు నుంచి ఇవతలకు వచ్చింది. సింహం, ఎలుగుబంట్ల వైపు చూసింది. ఆ రెండూ చలనం లేనట్టు పడున్నాయి. నక్క ఏమాత్రం చప్పుడు చేయకుండా ఎంతో జాగ్రత్తగా జింక మాంసాన్ని కడుపునిండా తింది. మిగిలిన దానిని పొదలమాటుకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది.


నడ్డి విరిగిన నక్క (01/06/2011)

అనగనగా ఒక అడవిలో ఒక టక్కరినక్క ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం బయలుదేరింది. దారిలో దానికి ఒక పులి ఎదురొచ్చింది. ఆ పులి కూడా చాలా ఆకలితో ఉండి ఆహారం కోసం వెతుకుతోంది. నక్కను చూడగానే పులి దాని వెంటపడింది.
‘బాబోయ్! నా ఆకలి సంగతి సరే.

ఈ పులికి దొరికితే నేను దానికి ఆహారమైపోతాను’ అని భయంగా అనుకుంటూ నక్క పరుగు తీసింది. పులి దాన్ని వెంబడించింది. నక్క పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు పైకి ఎక్కేసింది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక ఎలుగుబంటి నిద్రపోతోంది. నక్క రాకతో దానికి నిద్రాభంగమై కళ్ళుతెరిచి చూసింది.

‘‘ఎలుగుబంటి మామా! ఈ చెట్టు కింద ఒక పులి నాకోసం కాచుకుని కూర్చుంది. కొద్దిసేపు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాలు కాపాడు’’ అని ప్రాధేయపడింది.

‘సరే’నంటూ ఎలుగుబంటి తిరిగి నిద్రలోకి జారుకుంది. నక్క ఎప్పుడైనా కిందకు దిగకపోతుందా, దాన్ని తినకపోతానా అని పులి చెట్టు కిందే కాపు కాసింది. ఎంతకీ పులి కదలకపోవడంతో దాని బారినుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగింది. చివరకి దానికో ఉపాయం తట్టి ఎలుగుబంటి వైపు చూసింది. ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ‘దీన్ని కిందకు తోసేస్తే? అప్పుడు పులి దాన్ని తింటుంది కాబట్టి నన్ను వదిలిపెడుతుంది. అది తినగా మిగిలిన మాంసాన్ని నేను తినొచ్చు. ఈ విధంగా నా ప్రాణాలను నేను రక్షించుకోవడమే కాకుండా నా కడుపు కూడా నిండుతుంది’ అని ఆలోచించి నక్క ఎలుగుబంటిని కిందకు తోసేసింది.

అయితే ఎలుగుబంటి పడటం పడటం సరిగ్గా పులి మీద పడింది. ఎలుగుబంటి బరువుకు పులి నడ్డి విరిగింది. జరిగిందేమిటో ఎలుగుబంటికి అర్థమైంది. అంతే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టెక్కి నక్క గూబ మీద ఒక్కటిచ్చింది. గూబ గుయ్యిమన్న నక్క పట్టు తప్పి కింద పడింది. దానితో దాని నడ్డి కూడా విరిగింది.
నీతి:దుష్టులకుఆశ్రయంఇవ్వకూడదు.


సమయస్ఫూర్తి ‍‍‍ కథ‌ ( 01/06/2011)

ఇతరులకు సాయపడే మనస్తత్వం ఉన్న రామానందుడు ఆ గ్రామంలో ఉన్న గుడ్డివాడైన సోముడికి సాయపడాలనుకున్నాడు. సోముడు అంగవైకల్యం అధిగమించి జీవితంలో స్థిరపడాలంటే ఏదైనా విద్య నేర్పించడం అవసరమని గ్రహించి, తన సంపాదనలో కొంత ఖర్చు చేసి ఒక సంగీత విద్వాంసుడి దగ్గర చేర్పించాడు.
భగవంతుడు దయామయుడు. సోముడికి కళ్లు ఇవ్వకపోయినా గొంతులో మాధుర్యాన్ని ఇచ్చాడు. నిరంతర సాధనతో కొద్ది కాలంలోనే గురువు మన్ననలను పొందాడు.
సోముడు రామానందుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ‘‘మొదట నువ్వు సాయపడతానంటే ఎంతో కొంత డబ్బు ఇచ్చి తాత్కాలిక సాయం చేస్తావనుకున్నాను. ఇలా శాశ్వత సంపద అందచేస్తావనుకోలేదు. నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బాగుంటుంది. అంగవైకల్యం ఉన్నవారికి తాత్కాలిక సాయంగాని, సానుభూతి గాని పెద్దగా ఉపయోగపడదు. ఆత్మస్థయిర్యం పెంచే నీ సాయం కొండంత అండ’’ రామానందుడ్ని ఆలింగనం చేసుకున్నాడు సోముడు.
‘‘నా మనస్సుకు పుట్టిన బుద్ధితో నాకు చేతనైనంత సాయం చేసాను. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినంత గొప్పతనం లేదు. ఇచ్చి పుచ్చుకోవడమే మానవ జీవితం. రేపటి రోజు ఈ సంగీతాన్ని నలుగురికి నేర్పి ప్రతిభావంతుల్ని వెలికి తీస్తావు. ఈ రోజు నేను అందజేసినది రేపు నువ్వు నలుగురికి పంచుతావు ఇది నిజం కదా!’’ అంటూ తల నిమిరాడు రామానందుడు.
రామానందుడి ఆప్యాయతకు సోముడి కళ్లు చెమర్చాయి. ‘‘అన్నా! నువ్వు చెప్పినట్టే ఈ శాశ్వత సంపదను నలుగురికీ పంచుతాను’’ అన్నాడు సోముడు.
‘‘ఈ రాజ్యంలో రాజుగారు కళాప్రియులు. అతని దగ్గర నీ ప్రతిభ చూపించి సంగీత కళాశాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుందాం’’ అంటూ అభయమిచ్చాడు రామానందుడు.
కొద్దిరోజులు సోముడితో సావాసం రామానందుడికి కూడా సంగీత ప్రవేశం కలిగింది. సోముడిలో ఒంటరితనం పోగొట్టేందుకు రామానందుడు తనకు తీరిక దొరికినపుడల్లా వచ్చి సోముడితో సంగీత సాధన చేస్తుండేవాడు. చివరకు రామానందుడు కూడా సంగీతంలో ప్రావీణ్యత సంపాదించాడు.
ఒకరోజు రామానందుడు సోముడ్ని వెంటపెట్టుకుని సంగీత ప్రదర్శన ఇచ్చేందుకు రాజుగారి కోటకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్దే అడ్డంకులు ఎదురయ్యాయి. రాజదర్శనం అంత తేలిక కాదన్నారు కాపలాదారులు.
కాపలా భటులు లంచం ఆశిస్తున్నట్టు గ్రహించిన రామానందుడు రాజుగారు ఇచ్చే కానుకల్లో సగం ముట్టచెబుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
రాజాస్థానంలో ప్రవేశం కలిగింది. రాజుగారి అనుమతితో సంగీత ప్రతిభను ప్రదర్శించారు. చూసిన వారంతా చప్పట్లతో జేజేలు పలికారు.
రాజు సంతృప్తి చెంది చెరో వంద బంగారు నాణేలు ఇద్దరికి బహూకరించాడు.
రామానందుడు తన వాటాలో యాభై నాణేలను లెక్కించి రాజుగారికి తిరిగి ఇవ్వబోయాడు.
రామానందుని చర్య రాజుగారిని అవమానించేట్టు ఉండడంతో రాజుగారికి కోపం వచ్చింది. పక్కనే వున్న మంత్రి కలగజేసుకుని ‘నువ్వు చేస్తున్న పని ఏమిటి?’ అని నిలదీసాడు.
‘‘క్షమించండి! నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?’’ ధైర్యంగా అడిగాడు రామానందుడు
రాజుగారికి కోపం చల్లారింది. రామానందుడి చేతల్లో ఏదో ఆంతర్యం ఉందని గ్రహించి ‘‘ముందు అబద్ధం చెప్పు. అది మాకు సబబుగా అనిపించకపోతే మీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది’’ హెచ్చరికగా చెప్పాడు.
‘‘అబద్ధం వినండి! మేమిద్దరం గుడ్డివాళ్లమనే సానుభూతితో చెరో వంద బంగారు నాణేలు కానుకగా ఇచ్చారు. నాకు ఒక కన్ను కనిపిస్తోంది. నా మిత్రుడికి రెండు కళ్లూ కనిపించవు. అతనికి వంద నాణేలు ఇచ్చినప్పుడు న్యాయంగా యాభై నాణేలు మాత్రమే నేను తీసుకోవాలిగా అందుకే తిరిగి యాభై నాణేలు మీకు అందించింది’’ అన్నాడు రామానందుడు.
రాజు సంతృప్తి చెందాడు. ‘అయితే ఈ సారి నిజం చెప్పు‘ అన్నాడు రాజు.
‘‘మీరు నటనా సార్వభౌములు. గొప్పగా నటించగలరు. అందులో ఇప్పుడు నటిస్తున్న గుడ్డివాడి పాత్ర అమోఘంగా ఉంది. తోటి కళాకారుడ్ని ప్రోత్సహించడం కళాకారుడిగా నా ధర్మం. అందుకే యాభై నాణేలు ప్రోత్సాహ బహుమతిగా ఇవ్వచూపింది’’ అన్నాడు రామానందుడు.
ఒక్కసారిగా రాజుగారి ముఖ కవళికలు మారిపోయాయి. ‘‘నేను గుడ్డివాడిగా నటిస్తున్నానా! రుజువేంటి?’’ కోపంతో అడిగాడు.
అప్పుడు కాపలా భటుల లంచాల గురించి తెలియజేస్తూ కోటలో జరుగుతున్న అవినీతి చర్యలను చూడలేని మిమ్మల్ని గుడ్డివాడిగా అంచనా వేయడంలో తప్పులేదుగా అదే రుజువు!’’ అన్నాడు రామానందుడు.
నిప్పులాంటి నిజం చెప్పిన రామానందుడి మాటల్లో యదార్థాన్ని మంత్రి ద్వారా ఆరా తీయించాడు రాజు. నిజమని తేలింది. భటులకు శిక్ష విధించాడు.
కోటలో జరుగుతున్న అవినీతి బండారాన్ని సమయస్ఫూర్తితో తెలియజేసిన రామానందుడిని మెచ్చుకుని మరిన్ని కానుకలతో సత్కరించాడు ఇద్దరిని ఆ రాజుగారు.
ఆకానుకలతోసంగీతకళాశాలస్థాపనకుపూనుకున్నాడురామానందుడు.


దోచుకునేవాడికి దొరికినంత. (01/06/2011)

అనగనగా ధర్మపురి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు సత్యవంతుడు. ఆ రాజు వద్ద చిత్రాంగుడు అనే సేవకుడు పనిచేసేవాడు. రాజు దర్శనం కోసం ప్రతిరోజు దర్భారుకు వచ్చే ప్రజలను లోనికి అనుమతించడానికి పదో, పాతికో పుచ్చుకోవడం అతని అలవాటు. ప్రజల సమస్యలను సాను కూలంగా విని ధర్మానికి లోపడి పరిష్కారించే రాజు కు సేవకుడి తీరు వేగుల ద్వారా తెలిసింది. అక్ర మంగా సేవకుడు ప్రజలను దోచుకోవడం రాజుకు నచ్చలేదు. వెంటనే ఆ సేవకుణ్ణి రాజ మందిరం నుంచి తొలగించి భక్తులను వరు సగా పంపించేలా దేవాలయం ముందు నియ మించాడు. కనీసం దైవభక్తి, పాపభీతి తో నైనా డబ్బులు తీసుకోవడం మానివేస్తాడని రాజు ఆలోచించాడు. రెండురోజులు నమ్మకంగా పని చేసి గుడికి వచ్చిపోయేవారిని గమనించిన ఆ సేవకుడు మూడోరోజునుంచి ప్రత్యేకదర్శనం అంటూ భక్తులతో కూడా డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. వేగుల ద్వారా విషయం తెలు సుకున్న రాజు చిత్రాంగుడిలో మార్పురాకపోవ డంతో ఆశ్చర్య పోయాడు. ఉద్యోగం నుంచి తొలగిస్తే అతని కుటుంబం వీధిన పడుతుందని భావించాడు. ఏలాగైన అతనిలో మార్పు తీసుకు రావాలన్న ప్రయత్నంతో శ్మశానం వద్ద కాపలాదారుడిగా నియమించాడు. రాజ మందిరంలో దర్జాగా, దేవాలయం లో నిత్యం దేవుడిని చూస్తూ ఉండాల్సిన తాను శ్మశానం ముందు కాపలా దారుడిగా పనిచేస్తున్నందుకు సేవకుడు పశ్చాత్తాప పడతాడని రాజు భావించారు. కాని సేవకుడిలో మార్పులేదు. రెండు, మూడు రోజులు పరిస్థితులు గమ నించాడు చిత్రాంగుడు. ఆ తరువాత కర్మకాండలకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలుచేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన రాజు ఇక లాభం లేదనుకున్నాడు. చిత్రాంగుడినే పిలిచి కారణం తెలుసుకుని కఠినంగా శిక్షిం చాలని నిర్ణయించాడు. అతడిని రాజదర్భారుకు పిలిపించి, నిండు సభలో 'ఉచితంగా చేయాల్సిన పనుల కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం తప్పు కదా. ఎందుకు చేశావు' అని ప్రశ్నించాడు. శాంతంగా ఉండే మహారాజు ఉగ్రరూపం చూసి సభలోని వారందరూ భయంతో వణికి పోయారు. చిత్రాంగుడికి మరణశిక్ష తప్పదని భావించారు. కాని చిత్రాంగుడు మాత్రం బెదర లేదు. ఎంతో శాంతంగా 'మహారాజా!, నేను చేసింది తప్పే. కాని రోజు అనేకమందిని డబ్బులు అడి గాను. కొందరు ఎమి అనకుండా ఇచ్చారు, మరికొందరు తిట్టుకుంటూ ఇచ్చారు. కాని ఎవ్వరు కూడా ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించలేదు. మీకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. మీరు రోజు అందరినీ కలిసి వారి సమస్యలు వింటారని తెలుసు. కాని ముందుగా తామే మీ మందిరానికి రావాలన్న ఆరా టంతో నేను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చే వారు. ఇక దేవాలయంలో దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు. కాని ఎక్కువ తప్పులు చేసిన వాడికి ప్రత్యేకపూజలు అనగానే తాము చేసిన పాపాలు పోతాయని నమ్మకం. అందుకే డబ్బులు ఇచ్చేవారు. ఇక శ్మశానంలో కూడా కర్మకాం డలు త్వరగా ముగించాలని ఆరాటమే తప్ప పోయిన మనిషిపై మమకారం లేదు. అందుకే డబ్బులు ఇచ్చారు. తూతూ మంత్రంగా కర్మ కాండ చేసి వెళ్లిపోయారు. డబ్బులు ఇచ్చే ప్రజ లకు లేని పట్టింపు తీసుకునే నాకు ఎందుకు రాజా'' అని ఎదురు ప్రశ్నవేసాడు. చిత్రాంగుడి తీరుకు సభలోని వారు ఆశ్చర్యపోయారు. రాజు నోట మాట లేదు. తప్పు సేవకుడిది కాదు అత నిని అవినీతి దిశగా ప్రేరేపించిన ప్రజలదే అన్న వాస్తవం తెలుసుకున్నాడు. లంచం తీసుకునే వాడి కన్నా ఇచ్చేవాడికే ఎక్కువ శిక్ష ఉంటుందని సభలో ప్రకటిం చాడు. అంతే ఆ రోజు నుంచి చిత్రాంగుడితో పాటు అనేక మందిలో మార్పు వచ్చింది. ధర్మపురి రాజ్యం ఎందరికో ఆదర్శం అయ్యింది. పిల్లలూ! ఇప్పుడు చెప్పండి! ఈ కథ ద్వారా మీకు ఏం అర్థం అయ్యిందో! ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాళ్లకి లోటు లేదు. అందుకే ప్రశ్నించడం నేర్చుకోండి


More Stories: 1 | 2 | 3 | 4